Thu Dec 19 2024 17:52:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేబినెట్ లో చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పనున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుంది. ఇప్పటి వరకూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుంది. ఇప్పటి వరకూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. దీనిపై వైసీపీ విమర్శలు చేస్తుంది. ప్రజల్లో కూడా ఒకింత ఇంకా ఎప్పుడు అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, నిదానంగా చెప్పిన హామీలను అమలు చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ముందు పాలనలో కుదురుకున్న తర్వాత నిధులు అందుబాటులో ఉండటం బట్టి హామీలను అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజల్లో అసహనం పెరగకముందే ఇచ్చిన ప్రామిస్ లలో ఒకటి రెండింటినైనా అమలు చేస్తే కొంత వరకూ ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
పెండింగ్ లో హామీలు...
అనేక హామీలు పెండింగ్ లో ఉన్నాయి. మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వంటి వాటిని అమలు చేయడంపై ఇప్పటికే చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. వీటిలో తొలుత ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు మాత్రం వీలు చూసుకుని అమలు చేయాలని భావిస్తున్నారు. ఇక నిరుద్యోగుల్లో అసహనం పెరగకుండా నిరుద్యోగ భృతిని నెలకు మూడు వేల రూపాయలు అందించేందుకు త్వరగా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. నిరుద్యోగ భృతిపై నేడు కేబినెట్ లో చర్చించే అవకాశముందంటున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారెంత మంది? నిరుద్యోగులుగా ఉన్నవారి డేటా సేకరణకు కొంత సమయం పట్టే అవకాశముంది.
నిరుద్యోగ భృతి....
మెగా డీఎస్సీ వంటి వాటికి సంబంధించిన ఫైలుపై సంతకం చేసినప్పటికీ కంపెనీలు కొత్తవి రాకపోవడంతో ఉపాధి అవకాశాలు కూడా పెద్దగా కల్పించలేకపోయారు. పైగా రాజధాని అమరావతి నిర్మాణం పనులకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది కొంత విమర్శలకు దారి తీసే అవకాశముందని చంద్రబాబు భావిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు ఆర్టీసీకి 250 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇక నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు అంటే దీనిపై విధివిధానాలను నిర్ణయిస్తే అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఈ కేబినెట్లో నిరుద్యోగ భృతితో పాటు జన్మభూమి 2.0 పై కూడా చర్చించనున్నారు. నిధులను ఖర్చు చేయకుండా జన్మభూమి కింద గ్రామాభివృద్ధి పనులను చేపట్టాలని భావిస్తున్నారు. దీనిపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించే అవకాశముంది.
Next Story